రఘురామకృష్ణంరాజుపై వేటుకి వైసీపీ రంగం సిద్ధం..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై వేటు వేసి పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు ఎంపీలను దారికి తీసుకువచ్చేందుకు వైసీపీ అధిష్టానం రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.

రఘురామ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ఏపీతోపాటు ఢిల్లీలోనూ వైసీపీ పరువు తీసేలా ఆయన వ్యవహరిస్తున్నారు. మాటల మంటలు రేపుతూ రచ్చ చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్ లో పార్టీపై విమర్శలు చేసే వారికి దడ పుట్టించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.

ఈ క్రమంలోనే రఘురామకృష్ణంరాజుపై వేటు వేయాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. న్యాయపరమైన చిక్కులు ఎదురైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వెనుకాడేది లేదని అందరికీ సంకేతాలు పంపాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. గతంలో జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ పై ఇలానే అనర్హత వేటు పడింది. అదేపద్ధతిలో రఘురామపైన వేటు వేసేందుకు న్యాయసలహాను వైసీపీ అధిష్టానం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగానే రఘురామపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితోనూ వైసీపీ పార్లమెంటరీ నేతలు మాట్లాడాలని డిసైడ్ అయ్యారట.. ఇద్దరు వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లారని తెలిసింది. ముందుగా పార్టీ నుంచి బహిష్కరించి ఆ తర్వాత అనర్హత వేటు వేయాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. ఢిల్లీలో అంతా వర్కవుట్ అయితే రఘురామకు షాకివ్వాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here