చిత్రం : ‘భీష్మ’

నటీనటులు: నితిన్-రష్మిక మందన్న-అనంత్ నాగ్-జిష్ణు సేన్ గుప్తా–వెన్నెల కిషోర్-సుదర్శన్-సంపత్-నరేష్ రఘుబాబు-బ్రహ్మాజీ-సుదర్శన్ తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల

కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డ కథానాయకుడు నితిన్. గత రెండు మూడేళ్లుగా అతడికి హిట్టే లేదు. హ్యాట్రిక్ ఫ్లాపులతో రేసులో వెనుకబడిపోయాడు. దీంతో ఈసారి కొంచెం బ్రేక్ తీసుకుని ఆచితూచి చేసిన సినిమా ‘భీష్మ’. ‘ఛలో’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల రూపొందించిన చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రమైనా నితిన్ ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించేలా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

భీష్మ (నితిన్) డిగ్రీ కూడా పూర్తి చేయకుండా జీవితంలో ఓ లక్ష్యమంటూ లేకుండా తిరుగుతున్న కుర్రాడు. మిగతా కుర్రాళ్లలా తనకూ ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలని తపించిపోతుంటాడు. అతడికి అనుకోకుండా ఛైత్ర (రష్మిక మందన్న) పరిచయమవుతుంది. ఆమె సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్ చేసే భీష్మ ఆర్గానిక్స్ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగి. ఆమె వెంట పడి నెమ్మదిగా తనను ఇంప్రెస్ చేస్తాడు భీష్మ. ఇంతలో భీష్మ ఆర్గానిక్స్ సంస్థ అధినేత (అనంత్ నాగ్) విచిత్రమైన పరిస్థితుల మధ్య భీష్మను తన సంస్థకు సీఈవోగా ప్రకటిస్తాడు. డిగ్రీ కూడా పూర్తి చేయని భీష్మను అంత పెద్ద సంస్థకు సీఈవోగా చేయడానికి కారణమేంటి.. అంత పెద్ద పదవిలోకి వచ్చిన భీష్మ సంస్థను ఎలా నడిపించాడు.. ప్రత్యర్థుల నుంచి దాన్ని ఎలా కాపాడాడు.. అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

ఏడెనిమిది వేల కోట్ల విలువైన సంస్థకు.. ఆ సంస్థతో ఎలాంటి సంబంధం లేని.. ఒక లక్ష్యమంటూ లేకుండా తిరిగే.. కనీసం డిగ్రీ కూడా పాసవని.. సోషల్ మీడియాలో మీమ్స్ తయారు చేసుకుంటూ కాలక్షేపం చేసే ఒక కుర్రాడు సీఈవో అయిపోతాడు. ఆ సంస్థ సమస్యలన్నీ తీర్చేస్తాడు. ఈ సంస్థకు పోటీదారు అయిన పెద్ద కార్పొరేట్ సంస్థను నడిపించే విలన్.. హీరో ధాటికి నిలవలేకపోతాడు. అతడి కంపెనీయే మూతపడిపోతుంది. ఏసీపీ కూతురు ఓ ఉన్నత స్థాయి ఉద్యోగి అయిన హీరోయిన్.. హీరో ఒక ఫైట్ చేశాడని.. తన కోసం కొన్ని పుస్తకాలు చదివాడని.. ఒక స్పీచ్ ఇచ్చాడని ఇంప్రెస్ అయిపోతుంది. అతడితో ప్రేమలో పడిపోతుంది. ‘భీష్మ’లో చాలా సినిమాటిగ్గా అనిపించే ఇలాంటి విషయాలు బోలెడు. తెలుగు సినిమాల్లో చాలా ఏళ్ల పాటు వాడి వాడి అరిగిపోయిన ‘టెంప్లేట్స్’ చుట్టూనే ‘భీష్మ’ కూడా తిరుగుతుంది. దీని కథ.. కథనం అన్నీ కూడా సగటు ‘కమర్షియల్ ఫార్ములా’ను అనుసరించే సాగేవే. అయినా కూడా ఇవి పెద్ద కంప్లైంట్స్ అనిపించకుండా చేసే మ్యాజిక్ ఉంది ఈ సినిమాలో.

సినిమా చూసి బయటికొచ్చాక ఇలాంటి సినిమాలు చాలా చూశాం కదా.. ఏముంది ఇందులో ప్రత్యేకత అని అనిపిస్తే అనిపించొచ్చేమో కానీ.. థియేటర్లో ఉన్నంతసేపూ ప్రేక్షకుడిని కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ డోస్ మాత్రం ఇస్తుంది ‘భీష్మ’. కథాకథనాల సంగతెలా ఉన్నా.. సింపుల్ గా ఉంటూనే సరదాగా సాగిపోయే సన్నివేశాలు.. ప్లెజెంట్ ఫీలింగ్ ఇచ్చే పాత్రలు.. లవబుల్ గా అనిపించే ఆర్టిస్టులు.. గిలిగింతలు పెట్టే డైలాగులు.. కంటికింపుగా అనిపించే విజువల్స్.. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్.. ఇవన్నీ కలిసి ‘భీష్మ’ను ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా మార్చాయి.

కథాకథనాల విషయంలో మరీ బుర్ర బద్దలు కొట్టేసుకోకుండా.. చాలా కన్వీనియెంట్ గా సగటు ‘కమర్షియల్’ కథను రాసుకున్న యువ దర్శకుడు వెంకీ కుడుముల… లాజిక్ సంగతి పక్కన పెట్టి ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ట్రెండీగా అనిపించే వెంకీ వన్ లైనర్స్ సినిమాకు అతి పెద్ద ఎస్సెట్. ఈ తరం యూత్ వాడే పదాలు.. వేసే జోకులు.. వాళ్లు చేసే మీమ్స్ స్ఫూర్తితోనే ఫన్నీ డైలాగులు రాసిన వెంకీ.. తాను ఈ తరం దర్శకుడినని చాటుకున్నాడు. అంతే కాక వెన్నెల కిషోర్ ను సరిగ్గా వాడుకుంటే అతను సినిమాకు ఎంత బలమవుతాడో గుర్తించిన వెంకీ.. తన గురువుకు ఏమాత్రం తగ్గని స్థాయిలో వినోదం పండించడం సినిమాలో ఓ మేజర్ హైలైట్. ఈ మధ్య కాలంలో కిషోర్ తో ఈ స్థాయిలో కామెడీ పండించిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అతడి హావభావాలు.. డైలాగులు కొన్ని చోట్ల కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాయి.

‘భీష్మ’ ఆరంభంలో తనకు ఏ అమ్మాయీ పడట్లేదన్న అసహనంతో ఒక పాట వేసుకుంటాడు హీరో. అందులో సింగిల్ గా ఉండటంలో తన పాట్లన్నీ వివరిస్తాడు. చివర్లో ఓ అమ్మాయి వచ్చి ఫొటో తీయమని అడుగుతుంది. తీరా కెమెరా ఆన్ చేసేసరికి వెళ్లి భర్త పక్కన నిలబడుతుంది. వెంటనే మూడ్ మారిపోయిన హీరో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి సెల్ఫీ క్లిక్ చేస్తాడు. తర్వాత వచ్చి ఫొటో చూసుకున్న అమ్మాయి షాకవుతుంది. వెంకీ సెన్సాఫ్ హ్యూమర్ ఎలాంటిదో.. ‘భీష్మ’ ఎలా నడుస్తుందో చెప్పడానికి ఈ చిన్న సీన్ ఒక ఉదాహరణ. ఇక్కడ మొదలైన ఎంటర్టైన్మెంట్ మోడ్.. చివరి వరకు అలాగే కొనసాగుతుంది. హీరోయిన్ని కామెంట్ చేసిన రౌడీ బ్యాచ్ ను కొట్టడం.. ఆడిటోరియంలో విలన్ రెచ్చిపోతుంటే అతణ్ని గాలి తీయడం.. ఇలాంటి పనులకు ఇంప్రెస్ అయిపోయి హీరోయిన్ ఐలవ్యూ చెప్పడం.. విలన్ బ్యాచ్ రైతుల్ని మభ్యపెడుతుంటే ఫైట్ చేసి వాళ్లకు న్యాయం చేయడం.. విలన్ ఏం చేసినా దానికి బలమైన కౌంటర్ ఎటాక్ చేయడం.. ఇలా ‘భీష్మ’లో ఏ సన్నివేశం తీసుకున్నా కొత్తగా అనిపించదు. కానీ ఆ సన్నివేశాలు ఎంగేజ్ చేసేలా.. ఎబ్బెట్టుగా అనిపించకుండా వెంకీ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ టచ్ ‘భీష్మ’ను ఎంగేజింగ్ గా మారుస్తుంది. ప్రతి సన్నివేశంలో కొసమెరుపులా అనిపించే చిన్న చిన్న ట్విస్టులు ఆసక్తి రేకెత్తిస్తాయి.

సినిమా మధ్యలో సీరియస్ ఇష్యూ తెరపైకి వచ్చినా.. ద్వితీయార్ధమంతా సేంద్రియ వ్యవసాయం చుట్టూనే తిరిగినా.. వెంకీ ‘కమర్షియాలిటీ’ ఫ్యాక్టర్ మాత్రం మిస్ కాలేదు. సమస్యను దాని పరిష్కార మార్గాల్ని ఎంత ప్రభావవంతంగా చూపించారన్నది పక్కన పెడితే.. వినోదం మాత్రం తగ్గకుండా చూసుకున్నాడు దర్శకుడు. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం నెమ్మదించినా.. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ మరీ సినిమాటిగ్గా అనిపించడం.. విలనీ తేలిపోవడం.. హీరోకు సవాలన్నదే లేకపోవడం ‘భీష్మ’లో లోపాలే. కానీ ఎక్కడా పెద్దగా గ్యాప్ లేకుండా కామెడీ డోస్ పడుతుండటం వల్ల ‘భీష్మ’ బోర్ అయితే కొట్టించదు. ఓవరాల్ గా చెప్పాలంటే.. ‘భీష్మ’ కొత్తగా అనిపించే.. ప్రత్యేకమైన సినిమా కాదు. కానీ సరదాగా సాగిపోతూ చూస్తున్నంతసేపూ ఎంటర్టైన్ చేస్తుంది.

నటీనటులు:

వరుసగా మూడు ఫ్లాపులొచ్చినా నితిన్ ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చాలా కాన్ఫిడెంట్ గా భీష్మ పాత్రలో ఒదిగిపోయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. మాంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లు పడినపుడు హీరోలు ఎంజాయ్ చేస్తూ ఆ పాత్రను చేయడం చూస్తుంటాం. ఈ సినిమాలో నితిన్ కూడా అదే చేశాడనిపిస్తుంది. అందువల్లే భీష్మ పాత్ర బాగా పండింది. ఈ తరం యూత్ బాగా కనెక్టయ్యేలా సాగుతుంది అతడి పాత్ర.. నటన. తన లుక్ కూడా ట్రెండీగా ఉండేలా చూసుకున్న నితిన్.. గత సినిమాలతో పోలిస్తే అందంగా కూడా కనిపించాడు. రష్మిక మందన్న పాత్రకు ఫిట్ అనిపించింది. ఆమె నటన ఓకే. తన పాత్ర ఆరంభంలో ప్రత్యేకంగా అనిపించినా.. తర్వాత హీరో డామినేషన్ వల్ల సైడ్ అయిపోయింది. గ్లామర్ విషయంలో రష్మిక కొన్నిసార్లు బాగా అనిపిస్తుంది. కొన్నిచోట్ల మాత్రం తేలిపోయింది. విలన్ పాత్రలో జిష్ణు సేన్ గుప్తా చూడ్డానికి బాగున్నాడు. నటన కూడా ఓకే. కానీ అతను ప్రత్యేకంగా చేయడానికి పాత్రలో ఏమీ లేకపోయింది. కీలకమైన పాత్రలో కన్నడ నటుడు అనంత్ నాగ్ హుందాగా నటించి మెప్పించాడు. వెన్నెల కిషోర్ తనదైన శైలిలో కామెడీతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాడు. రఘుబాబు అతడికి సహకరించాడు. సంపత్.. బ్రహ్మాజీ.. నరేష్.. సుదర్శన్.. వీళ్లంతా వినోదం పంచడంలో తమ వంతు పాత్ర పోషించారు.

సాంకేతిక వర్గం:

మహతి స్వర సాగర్ ఆడియో బ్యాడ్ అనలేం. అలాగని సినిమాకు పెద్ద ఎస్సెట్ కూడా కాలేదు. సింగిల్ యాంథమ్ ఒక్కటి ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘ఛలో’లో చూసీ చూడంగానే తరహా చార్ట్ బస్టర్ సాంగ్ ఇవ్వకపోవడం మైనస్. నేపథ్య సంగీతం ఓకే. సాయిశ్రీరామ్ విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ లో రాజీ లేకపోవడం అతడికి కలిసొచ్చింది. ఒక పెద్ద హీరో సినిమా స్థాయిలో నిర్మాణ విలువలు పాటించింది సితార ఎంటర్టైన్మెంట్స్. ఇక దర్శకుడు వెంకీ కుడుముల కథ విషయంలో పెద్దగా కష్టపడినట్లు లేడు. సన్నివేశాల్ని వినోదాత్మకంగా తీర్చిదిద్దితే ప్రేక్షకులు ఇంకేం పట్టించుకోరు అన్నది వెంకీ ఆలోచనగా కనిపిస్తుంది. తన గురువు త్రివిక్రమ్ తో పాటు మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివల స్ఫూర్తితో సన్నివేశాల్ని.. మాటల్ని తీర్చిదిద్దుకున్న వెంకీ… తన వాటిని తెరపై చక్కగా ప్రెజెంట్ చేశాడు. అతడి పెన్నులో పంచ్ పవర్ బాగుంది. డైలాగుల్లో మెరుపులు చాలానే ఉన్నాయి. ఈ తరంలో కామెడీని బాగా డీల్ చేయగల దర్శకుల్లో ఒకటిగా వెంకీ కనిపిస్తాడు.

చివరగా: భీష్మ…రొటీన్ బట్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ

రేటింగ్: 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here