ఆశలు రేపుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు.

కరోనా వైరస్, లాక్‌డౌన్ ప్రభావంతో తెలంగాణ ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఇలాంటి సమయంలో కార్గో సేవల ద్వారా ఆర్టీసీకి ఆదాయం సమకూరుతోంది.

లాక్‌డౌన్‌తో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడిన వేళ.. కార్గో, కొరియర్, పార్శిల్ సేవల ద్వారా ఆర్టీసీకి చెప్పుకోదగ్గ మొత్తంలో ఆదాయం లభిస్తోంది. కరోనాకు ముందు ఆర్టీసీకి రోజూ రూ.5 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రూ. 2 కోట్లు రావడం కూడా కష్టంగా మారింది. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవడం, సొంత వాహనాల్లో వెళ్లడానికి ప్రాధాన్యం ఇవ్వడమే దీనికి కారణం. కాగా.. ఇటీవల ప్రారంభించిన కార్గో సేవలు ఆర్టీసీకి ఊరటనిస్తున్నాయి.

గతంలో పార్శిల్ సేవలను ప్రయివేట్ సంస్థలకు అప్పగించిన ఆర్టీసీ.. ప్రస్తుతం తనే పార్శిల్ సేవలను చేపట్టింది. దీంతో ఆర్టీసీకి పార్శిల్ సేవల రూపంలో ఆదాయం రోజుకు లక్ష రూపాయల నుంచి రూ. 3 లక్షలకు పెరిగింది. కార్గో, కొరియర్ సేవలకు మంచి స్పందన వస్తుండటంతో.. ఈ సేవలను మరింత విస్తరించే యోచనలో ఆర్టీసీ ఉంది. కార్గో సేవల కోసం ప్రస్తుతం 126 బస్సులను ఉపయోగిస్తుండగా.. ఇప్పటికే కొన్ని చోట్ల ఎరువులను ఆర్టీసీ కార్గో బస్సుల్లో తరలిస్తున్నారు. త్వరలోనే మరో 24 కార్గో బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోనుంది.

తమ కార్గో సేవలను వినియోగించుకోవాలని ఎఫ్‌సీఐ, రామగుండం ఫెర్టిలైజర్స్, సింగరేణి తదితర సంస్థలకు ఆర్టీసీ లేఖలు రాసింది. ఈ-కామర్స్ సంస్థలతోనూ ఆర్టీసీ చర్చలు జరపనుంది. గ్రామాల్లోనూ కార్గో సేవలను అందుబాటులోకి తీసుకు రావాలని యోచిస్తోంది. కండక్టర్ల దగ్గరుండే టిమ్స్ మెషీన్లు, సెల్ ఫోన్ల ద్వారా కూడా కొరియర్, పార్శిల్ సేవలను వాడుకునే సౌలభ్యం కల్పించే దిశగా అడుగులేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here