సినిమాలు థియేటర్లలో కాకుండా ఆన్ లైన్ లోనే నేరుగా విడుదల అవుతాయంటే ఒకప్పుడు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ప్రస్తుతం ఓటీటీ సేవలు ఓ స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లన్నీ డిజిటల్ బాటపడుతున్నాయి. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడంతో.. డిజిటల్ ప్లాట్ ఫామ్ లు తమ దూకుడును మరింత పెంచేశాయి. తాజాగా నాని హీరోగా వచ్చిన ‘వి’ సినిమాను.. అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడంతో ఓటీటీ సేవలకు మరింత ఆదరణ పెరిగింది.
ఇదిలా ఉంటే.. ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని చూస్తోంది ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్. తెలుగులో ప్రముఖ దర్శకులతో వెబ్ సిరీస్ లు నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి, ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వానలు ఫైనల్ కాగా… మరో ఇద్దరు డైరెక్టర్లను ఖరారు చేయనున్నారని సమాచారం. ఒక్కో డైరెక్టర్ నాలుగు ఎపిసోడ్స్ నిర్మించబోతున్నారు. నటీ నటులను త్వరలోనే ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ ద్వారా నెట్ ఫ్లిక్స్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది.