జంగిల్ క్రూస్ మూవీ రివ్యూ

అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చిత్ర నిర్మాణ సంస్థ వాల్డ్ డిస్నీ పిక్చర్స్. ఆ సంస్థ నిర్మించిన ఫాంటసీ అడ్వంచరస్ మూవీ ‘జంగిల్ క్రూస్’. వరల్డ్ ఫేమస్ రెజ్లర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాక్ అలియాస్ డ్వేన్ జాక్సన్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 24, శుక్రవారం విడుదల అవుతోంది. ఇప్పటికే ‘ది స్కార్పియన్ కింగ్, ది మమ్మీ రిటర్న్స్’ వంటి పలు చిత్రాలతో రాక్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఏర్పడ్డారు. భారతదేశంలోనూ అతన్ని అభిమానించేవారు ఎందరో. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడిన ‘జంగిల్ క్రూస్’ ఎట్టకేలకు జనం ముందుకు వచ్చేస్తోంది.

ఇది వందేళ్ళ క్రితం జరిగిన కథ. నిజానికి నాలుగొందల యేళ్ళ క్రితం మొదలైన కథ అనడం కరెక్ట్. దక్షిణ అమెరికాలోని అమేజాన్ నది పరివాహక ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో చంద్రబిందు వృక్షం అనేది ఒకటి ఉంటుంది. దాని పువ్వులు అమృతానికి సరిసమానం. మానవుల గాయాలను రూపుమాపడంతో పాటు వారిని రోగ విముక్తులను చేసే శక్తి ఆ పువ్వులకు ఉంటుంది. 1556లో స్పానిష్ కు చెందిన యోధుడు అగుర్రే తన అనుచరులతో కలిసి ఆ పువ్వును సంపాదించడానికి అక్కడికి వెళతాడు. అయితే… దానిని పొందే క్రమంలో వారంతా ప్రాణాలు కోల్పోతారు. అక్కడి సమీపంలోని పుకా మిచునా అనే గిరిజన తెగ వాళ్ళు చంద్రబిందు పుష్పం సాయంతో వీరికి ప్రాణం పోస్తారు. ఆ కృతజ్ఞత లేకుండా అగుర్రే ఆ పుష్పాలు ఉన్న ప్రాంతాన్ని చూపించమని గిరిజన తెగ నాయకుడిపై ఒత్తిడి తెస్తాడు. అతను అంగీకరించకపోవడంతో వారి గూడెంను తగలెట్టేసి, నాయకుడ్ని వధిస్తాడు. చనిపోతూ అతను ఇచ్చిన శాపం కారణంగా అగుర్రే, అతని అనుచరులు మరో ముగ్గురు అమేజాన్ నది దాటి బయటకు వెళ్ళలేకపోతారు. ఆ అడవి వారిని బంధించి అచేతనులుగా మార్చేస్తుంది.

ఇది జరిగిన నాలుగువందల సంవత్సరాలకు లేడీ సైంటిస్ట్ డాక్టర్ లిల్లీ అమేజాన్ అడవిలోని చంద్రబిందు పువ్వును సంపాదించగలిగితే, ప్రజలకు మేలు చేయవచ్చని, వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని, అందుకు తనకు సహకరించమని లండన్ లోని రాయల్ సొసైటీని కోరుతుంది. వారు అంగీకరించపోవడంతో తన తమ్ముడిని తీసుకుని అమేజాన్ నది దగ్గరకు బయలు దేరుతుంది. ఆ నదిలో నౌక కెప్టెన్ ఫ్రాంక్ సాయంతో ఆమె చేసే వీరోచిత ప్రయాణమే ‘జంగిల్ క్రూస్’ చిత్రం.

డిస్నీ పిక్చర్స్ మూవీ అనగానే భారీ అంచనాలు ఉండటం సహజం. అయితే వాటిని అందుకోవడానికి డైరెక్టర్ ఔమ్ కాలేట్ సెర్రా తనవంతు కృషి బాగా చేశాడు. సినిమాలో బోర్ కొట్టే సన్నివేశాలు, సందర్భాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఇది వందేళ్ళ క్రితం జరిగే కథ కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అవన్నీ తీసుకున్నాడు. సినిమా చూస్తుంటే మనం కూడా ఆ కాలంలోకి వెళ్ళిపోయిన అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో లిల్లీ సోదరుడు రాయల్ సొసైటీలో మాట్లాడే సన్నివేశం సరదాగానూ, ఆ వెంటనే లిల్లీ ఆర్కియాలజీ కార్యాలయం నుండి చంద్ర బిందు వృక్షం దగ్గరకి వెళ్ళేందుకు ఉపయోగపడే బాణంను దొంగిలించే సన్నివేశం ఆసక్తికరంగానూ ఉంది. ఇక లిల్లీతో పాటు ఆ వృక్షం పువ్వులను దొంగిలించడానికి జర్మనీ రాయల్ ఫ్యామిలీకి చెందిన యువరాజు ప్రయత్నించడంతో స్టోరీ రసవత్తరంగా మారింది. అమేజాన్ అడవిలోకి ప్రవేశించిన తర్వాత అగుర్రే, అతని అనుచరులతో ఫ్రాంక్, లిల్లీ చేసే పోరాటాలు ఒకవైపు, యువరాజు ఎత్తుల్ని చిత్తు చేయడం మరోవైపు ఉత్కంఠను కలిగిస్తాయి.

మొత్తం మీద ఓ పిరియాడిక్ ఫాంటసీ ప్రపంచంలోకి ‘జంగిల్ క్రూస్’ మూవీ మనల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇక ఫ్రాంక్ నేపథ్యం తెలిసిన తర్వాత ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఊహకందని విధంగా కథ సాగడంతో పాటు సాంకేతిక విలువలూ బాగుండి సమయమే తెలియదు. నటీనటుల విషయానికి వస్తే… డ్వేన్ జాక్సన్ ఇప్పటికే పాపులర్ స్టార్. డాక్టర్ లిల్లీ పాత్రను పోషించిన ఎమిలీ బ్లంట్ చక్కగా నటించింది. పోరాట సన్నివేశాలనూ చాలా సునాయాసంగా చేసేసి వీరిద్దరూ రక్తి కట్టించారు. లిల్లీ సోదరుడు మాక్ గ్రెగర్ గా జాక్ వైట్ హాల్ నటించాడు. ఆటలో అరటి పండు తరహాలో వినోదాన్ని పండించే ప్రయత్నం చేశాడు. ఇక అగుర్రేగా ఎడ్గర్ రామిరెజ్, నీలో గా పాల్ ఎడ్వర్డ్, యువరాజుగా జెస్సీ ప్లేమోన్స్ చక్కని నటన కనబరిచారు. రొటీన్ యాక్షన్ డ్రామాలు, బహుళ అంతస్తులు ఉన్న భవంతులపై జరిగే పోరాటాలూ చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు అమేజాన్ నది, దాని పరివాహక ప్రాంతంలోని అడవి, అందులోని ట్రైబల్స్ విన్యాసాలు… చూస్తుంటే ఎంతో రిలీఫ్ కలుగుతుంది. ఈ ఫాంటసీ అడ్వంచరస్ డ్రామాను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 2డీ లేదా 3డీలో చూసేయండి. హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.

ప్లస్ పాయింట్స్
ఆసక్తికరమైన కథ
ఉన్నత స్థాయి సాంకేతికత
వీనుల విందైన నేపథ్య సంగీతం

మైనెస్ పాయింట్స్
వందేళ్ళ నాటి కథ కావడం
స్ట్రయిట్ నెరేషన్

రేటింగ్ : 3/ 5

ట్యాగ్ లైన్: అద్భుత‌మైన జ‌ర్నీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here