పార్కును దత్తత తీసుకున్న హీరో శర్వానంద్..

హీరో శర్వానంద్ హైదరాబాద్‌లోని ఒక పార్కును దత్తత తీసుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన శర్వానంద్.. అనంతరం పార్కును దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు.రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. సినిమా, టీవీ రంగాలకు చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. తాజాగా ఈ జాబితాలో యంగ్ హీరో శర్వానంద్ చేరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వచ్ఛందంగా స్వీకరించిన శర్వా.. సోమ‌వారం ఎంపీ సంతోష్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ‘‘సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన స్ఫూర్తితో మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నాను. రోజురోజుకు మారుతున్న వాతావరణం, పెరుగుతున్న కాలుష్యంతో మనం భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే మనందరం మొక్కలు నాటాలి. వాటిని సంర‌క్షించాలి. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలి’’ అని పిలుపునిచ్చారు.

త‌మ‌ ఇంటి పక్కన ఉన్న జీహెచ్ఎంసీ పార్కులో యాదాద్రి విధానంలో మొక్కలు పెంచే ఏర్పాటు చేస్తున్నారని తెలిపిన శ‌ర్వానంద్‌, ఆ పార్కును తాను దత్తత తీసుకొని అందులోని మొక్కలను రక్షించే బాధ్యత తీసుకుంటాన‌ని చెప్పారు. పార్కులో అవసరమైన వాకింగ్ ట్రాక్‌ను, పార్కు అభివృద్ధి కోసం కావలసిన ఏర్పాట్లను త‌న‌ సొంత డబ్బులతో చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. త‌న‌ ఆహ్వానం మేరకు వచ్చిన ఎంపీ సంతోష్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఆయ‌న కృతజ్ఞతలు తెలియ‌జేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here