సినిమా రివ్యూ: రన్

రిలీజ్ డేట్: 29 మే 2020

నటీనటులు: నవదీప్, పుజితా పొన్నాడ

దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా

సంగీతం: నరేష్ కుమారన్

ప్రొడ్యూసర్: సాయి బాబా జాగర్లమూడి , వై రాజీవ్ రెడ్డి

ఆహా లో విడుదలైన ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం. నవదీప్ ఈ చిత్రంలో హీరోగా నటించగా నటి పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటించింది. దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా క్రైమ్ అండ్ సస్పెన్సు థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

కథ: ఓ ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న సందీప్ (నవదీప్), శృతి(పూజిత) అందమైన జీవితం గడుపుతూ ఉంటారు. వీరి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు నవదీప్ భార్య శృతి ఆత్మ హత్య చేసుకొని చనిపోతుంది.ఇది ఆత్మ హత్యకాదు మర్డర్ అని నిర్ధారణకు వచ్చిన పోలీసులు శృతి భర్త సందీప్ ఆమెను చంపాడని అనుమానిస్తారు. పోలీసుల నుండి తప్పించుకున్న సందీప్ తన భార్యను హత్య చేసిన వారిని వెతకడం మొదలుపెడతాడు. ఇంతకీ శ్రుతిది ఆత్మ హత్యా లేక మర్దరా? మర్డర్ అయితే ఆమెను చంపింది ఎవరు..? శృతిని సందీప్ చంపక పోతే చంపినవారిని పట్టుకున్నాడా? అనేదే మిగతా స్టోరీ…

నటీనటుల పనితీరు: అనుమానస్పద పాత్రలో నవదీప్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. శృతిని మర్డర్ చేసింది ఎవరో తెలుసుకోవాలనే కసి అలాగే ఆ మర్డర్ చేసేసింది తానే అన్నట్లు రెండు భిన్న షేడ్స్ లో సాగే పాత్రలో నవదీప్ చక్కగా నటించారు. సినిమా మొత్తం ఆయన భుజాలపై నడిపించారు.హీరోయిన్ పూజిత పొన్నాడకు చెప్పుకో దగ్గ పాత్ర పరిధి లేదు. సినిమా ప్రారంభంలోనే ఆమె పాత్ర చచ్చిపోతుంది.

ఈ మూవీలో ఒకప్పటి హీరో వెంకట్ కీలకమైన పోలీస్ రోల్ చేశారు. చాలా కాలం తరువాత స్క్రీన్ పై కనిపించిన వెంకట్ పోలీస్ గా పాత్రకు న్యాయం చేశారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ తో పాటు కథలో కీలక రోల్ చేసిన అమిత్ నటన మెప్పిస్తుంది. ఇక మిగతా పాత్రలు తమ పరిధిలో చక్కని నటన కనబరిచారు.

సాంకేతిక వర్గం పనితీరు: సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు కానీ బీజీఎమ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. నిర్మాణ విలువలు పరవాలేదు. కెమెరా పనితనం అలాగే ఎడిటింగ్ కొంత మేర ఆకట్టుకున్నాయి.ఇక దర్శకుడు గురించి చెప్పాలంటే శృతి హత్యకు కారణం ఎవరు అనే సస్పెన్సు మినహా దాని చుట్టూ నడిచే కథనంలో ఎటువంటి ఆసక్తి లేకుండా నడిపించారు.

విశ్లేషణ: కథ ప్రారంభంలోనే హీరోయిన్ పూజిత పాత్ర చనిపోతుంది. తన భార్య హత్య వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో హీరో సాగించే ప్రైవేట్ ఇన్వేస్టిగేషన్, ఆ క్రమంలో జరిగే హత్యలు ప్రేక్షకుడికి గొప్ప సస్పెన్సు ఇవ్వలేక పోయాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని పాత్రలు కథలో భాగంగా అనిపించవు. ముగింపు కూడా అంత ఆకర్షిణీయంగా లేదు. చాలా తక్కువ నిడివితో మూవీ తెరకెక్కించారు. నవదీప్ నటన మరియు అక్కడక్కడకా కొన్ని ట్విస్ట్స్ రన్ మూవీలో మెప్పించే అంశాలు. ట్రైలర్ చూసి ఓ గొప్ప థ్రిల్లర్ చూడబోతున్నాం అనుకుంటే పొరపాటే సుమా!!

రేటింగ్: 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here