సినిమా రివ్యూ: వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌

సమీక్ష: వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌
రేటింగ్‌: 2/5
బ్యానర్‌:
క్రియేటివ్ కమర్షియల్స్
తారాగణం: విజయ్‌ దేవరకొండ, రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరీన్‌, ఇజబెల్లా, ప్రియదర్శి, జయప్రకాష్‌ తదితరులు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: గోపి సుందర్‌
ఛాయాగ్రహణం: జయకృష్ణ గుమ్మడి
నిర్మాత: కె.ఏ. వలభ
రచన, దర్శకత్వం: క్రాంతిమాధవ్‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2020

‘అర్జున్‌ రెడ్డి’ రైటర్‌ అవతారం ఎత్తితే… ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ అవుతాడు. అర్జున్‌రెడ్డిలో విజయ్‌ దేవరకొండ యువతకి బాగా నచ్చాడని అలా చూపించడానికి దర్శకులు పనిగట్టుకుని ప్రయత్నిస్తున్నారో లేక అలాంటి లక్షణాలున్న పాత్రల్ని విజయ్‌ దేవరకొండ వెతుక్కుని మరీ చేస్తున్నాడో తెలీదు కానీ మళ్లీ మళ్లీ అదే తరహా పాత్రతో మెప్పించడానికి చూస్తున్నారు.

కథలోకి వెళితే… రైటర్‌గా రాణించాలని ఐటీ జాబ్‌ వదిలేసిన గౌతమ్‌ సోల్‌ వున్న స్టోరీ రాయలేక ఇబ్బంది పడుతుంటాడు. అతడితో విసిగిపోయిన యామిని (రాశి ఖన్నా) బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోతుంది. దీంతో పేపర్లో ఒక న్యూస్‌ చూసి బొగ్గుగనుల నేపథ్యంలో ఒక స్టోరీ రాయడం స్టార్ట్‌ చేస్తాడు. బొగ్గుగని కార్మికుడు శీనయ్య పాత్రలో తనని తాను ఊహించుకుంటూ కథ రాస్తాడు. ఆ తర్వాత పారిస్‌కి వెళ్లిపోయి అక్కడో ఫ్రెంచి అమ్మాయితో లవ్‌లో పడ్డట్టు మరో కథ రాస్తాడు.

 

కెరీర్‌ వదిలేసి రైటర్‌గా స్థిరపడదామని అనుకున్న సదరు గౌతమ్‌ రాసే రచనలు చూస్తే అతను రాంగ్‌ కెరీర్‌ ఎంచుకున్నాడనిపిస్తుంది. శోభన్‌బాబు, ఏఎన్నార్ల కాలం నాటి కథలు ల్యాప్‌టాప్‌లో ఇంగ్లీష్‌లో రాసేస్తుంటాడు. ఆ కథలు చదివి ఎమోషనల్‌ అయిపోయే ఓ ఫ్రెండ్‌ కూడా అతనికి వుంటాడు. బొగ్గుగనుల నేపథ్యంలో కూలీ కడుపున పుట్టి చదువుకోలేక కూలీగా మారి ఆ ఫ్రస్ట్రేషన్‌తో వున్న శీనయ్య పాత్రలో విజయ్‌ దేవరకొండ ఆకట్టుకుంటాడు. ఆ పాత్ర తాలూకు ఫ్రస్ట్రేషన్‌ అంతా తన మాటల్లో చూపిస్తాడు. పైగా తెలంగాణ నేపథ్యం కావడంతో విజయ్‌ మరింతగా ఆ పాత్రలో లీనమైపోయాడు. అయితే ఆ పాత్ర పరిచయం వరకే ఆహ్లాదంగా వుంటుంది కానీ అటుపై తన లేడీ బాస్‌ అతనితో వేసే వేషాలు, దానికి ఇతని రియాక్షన్లు, అతని భార్య పడే వేదన అంతా శోభన్‌బాబు సినిమా తరహాలో వుంటుంది. తన తోటి కార్మికు పిల్లల్ని బాగా చదివించమని ప్రోత్సహించే శీనయ్య తన కొడుకుని ఎందుకని కనీసం దగ్గరకి తీసుకోడనేది ‘వరల్డ్‌ ఫేమస్‌ రైటర్‌’కే తెలియాలి.

కనీసం రెండవ కథ అయినా సక్కంగా రాస్తాడా అంటే అదీ లేదు. ఆ కథ మరీ ఐడియాస్‌ ఇంకిపోయిన రచయిత బుర్రలోంచి వచ్చిన కథలా వుంటుంది. పైగా సదరు కథని లింక్‌ చేస్తూ తన ప్రేయసికి ముడి పెట్టి చివర్లో ఏదో ముక్తాయింపిస్తాడు. ఈ వివిధ రకాల గెటప్స్‌, నానా రకాల కథల మధ్య దర్శకుడి తపన ఏమిటో అర్థం కాదు. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ కాదు కదా కనీసం తన గల్లీలో వాళ్లయినా మాట్లాడుకునే గొప్ప క్షణాలు లేని లవర్‌ కథ ఇది. విజయ్‌ దేవరకొండ హెయిర్‌ స్టయిల్‌ని ఎన్ని విధాలుగా చూపించవచ్చు అనేదానికి సినిమాటిక్‌ డిపిక్షన్‌లా ఈ చిత్రం అనిపిస్తుంది.

అర్జున్‌ రెడ్డిలా పదే పదే చొక్కా తీసేసి బేర్‌ బాడీతో తిరిగేస్తే యూత్‌ కానీ, కాలేజ్‌ అమ్మాయిు కానీ కనక్ట్‌ అయిపోరు. అర్జున్‌రెడ్డి తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’లో విజయ్‌ని ప్రేక్షకులు మరింతగా ఆదరించి దానికి మూడు రెట్లు పెద్ద విజయాన్ని కట్టబెట్టారని మాత్రం ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కాదు. అంతెందుకు శీనయ్య పాత్ర పరిచయ సన్నివేశాల్లో విజయ్‌ ఎంతో రిఫ్రెషింగ్‌గా అనిపిస్తాడు. కానీ అతడిని ఆ ఎంటర్‌టైనింగ్‌ మోడ్‌లో చూపించకుండా బలవంతంగా భగ్న ప్రేమికుడి వేషం వేయించి రోడ్ల వెంట పరుగు పెట్టిస్తున్నారు. లవ్‌స్టోరీల్లో ఇదే లాస్ట్‌ అని విజయ్‌ ప్రకటించేసాడు… అర్జున్‌రెడ్డి సిరీస్‌కి ఇంతటితో ఎండ్‌ కార్డ్‌ వేసేసానని చెప్పడం అతని ఉద్దేశమయితే కనుక అదే పదివేలు . ప్రతి బాలూ సిక్సే కొట్టాలని చూస్తానన్నాడు. బహుశా అతని ఉద్దేశంలో సిక్స్‌ అంటే అర్జున్‌ రెడ్డి కావచ్చు. ఈ బాల్‌కి బౌండరీ దగ్గర క్యాచ్‌ ఇవ్వడం కాకుండా మిడ్‌ స్టంప్‌ ఎగిరింది కనుక ఈ సిక్స్‌ పరంపరకి స్వస్తి చెప్పి స్టడీ ఇన్నింగ్స్‌పై ఫోకస్‌ పెడితే బెటరు.

దర్శకుడు క్రాంతిమాధవ్‌కి వచ్చిన ఐడియా బాగానే వుంది. అయితే రచయితగా కథ రాస్తూ ఆ పాత్రల్లో తనని తాను ఊహించుకునే హీరోకి ఎల్లలు లేవు. ఇమాజినేషన్‌కి లిమిట్‌ ఎక్కడ వుంటుంది? అలా ఈ పాత్రని విక్షణంగా, అద్వితీయంగా తీర్చిదిద్దడానికి ప్రపంచమంత స్కోప్‌ వుంది. కానీ ఆ కథలు సిక్స్‌టీస్‌ నాటి పాత సినిమాని తపించేలా వుండడమే బాధిస్తుంది. తను రాసిన కథల్లో సోల్‌ లేదని పబ్లిష్‌ చేయకుండా పక్కన పడేసిన గౌతమ్‌లా దర్శకుడు క్రాంతిమాధవ్‌ కూడా తను రాసిన ఈ కథలో సోల్‌ లేదని గుర్తిస్తే బాగుండేది. డీప్‌లీ ఎమోషనల్‌ సబ్జెక్ట్‌ డీల్‌ చేయానే తపన అయితే వుంది కానీ అది తెరపైకి వచ్చేసరికి సివియర్లీ బోరింగ్‌గా తయారైంది. అర్జున్‌ రెడ్డిలా క్యారెక్టర్‌ స్టడీ చేయాలనే ఆలోచన అయితే వుంది కానీ అది కాస్తా అగమ్యగోచరంగా మిగిలిపోయింది.

విజయ్‌ దేవరకొండ ఇలాంటి పాత్రలు బాగా చేస్తాడు. ఇన్‌ఫ్యాక్ట్‌ ఈ చిత్రం నుంచి వాకౌట్‌ చేయకుండా చాలా మందిని ఆపేది అతని ప్రెజెన్సే. ముఖ్యంగా శీనయ్య పాత్రలో విజయ్‌ నటన ఆహ్లాదంగా వుంది. అతనికి ఐశ్యర్యారాజేష్‌ నుంచి చక్కని సహకారం లభించింది. అదే కథలో కనిపించే క్యాథరీన్‌ పాత్రకి అవసరమైన రూపంతో కనిపించింది. రాశి ఖన్నా పాత్ర విపరీతమైన ఎమోషనల్‌ కావడంతో ఆమె పలికే సంభాషణల్లో కూడా చాలా వరకు ఏడుస్తూనే చెప్పింది. ఆమె ఎమోషన్‌తో కనక్ట్‌ చేసిన తర్వాత ఏడిపిస్తే బాగుండేది కానీ ఏడుస్తూ మాట్లాడించడం వాల్ల ఆమెది అరణ్య రోదనలా అనిపిస్తుంది.

విజయ్‌ సినిమాలో ఒకటి, రెండు హిట్‌ సాంగ్స్‌ అయినా వుంటాయి. ఈ చిత్రానికి ఆ ఉపశమనం కూడా లేదు. ఒక్క హిట్‌ నంబర్‌ కూడా లేకపోవడంతో బోర్‌ మల్టిప్లయ్‌ అయినట్టుంటుంది. నిర్మాతలు  ధారాళంగా ఖర్చు పెట్టారు. ఛాయాగ్రాహకుడు కనువిందైన లొకేషన్లని బంధించాడు. అన్ని హంగు వున్నా కానీ ఇందులో గౌతమ్‌ చెప్పినట్టుగా కథలో ‘ఆత్మ’ లేదు. దర్శకుడు క్రాంతిమాధవ్‌ తన తరహాలో ఎమోషనల్‌ సినిమా తీయాలా, లేక విజయ్‌ని అర్జున్‌రెడ్డిలా చూపించాలా అనే సందిగ్ధంలో వుండిపోయిన భావన కలిగిస్తాడు. విజయ్‌తో ప్రేమకథలు తీస్తోన్న చాలా మంది దర్శకులు ఇదే అయోమయంలో పడిపోతున్నారు.

విజయ్‌ దేవరకొండని విపరీతంగా అభిమానించే వాళ్లు కూడా ‘అర్జున్‌రెడ్డి’ హ్యాంగోవర్‌ నుంచి ఇక బయటకి రమ్మని సహాలిచ్చేలా వున్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ నుంచి మరో డిజప్పాయింటింగ్‌ ఫిలిం. పూరితో సినిమాలో అయినా కొత్త విజయ్‌ని చూడవచ్చని ఆశిద్దాం.

బాటమ్‌ లైన్‌: వెరీ డిజప్పాయింటింగ్‌ లవర్‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here