సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోతోంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా రకరకాల సోషల్ మీడియా సైట్ల ద్వారా తమ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాను తప్పుగా ఉపయోగిస్తూ కొందరు ఆకతాయిలు సినీ తారలకు తలనొప్పి తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా ట్రోలింగ్స్ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్. గత కొంత కాలం నుచి సుహానాపై కొందరు నెటిజన్లు పనికట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. తన అందంపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
దీంతో తనపై వస్తోన్న ట్రోలింగ్స్ గురించి సుహాన తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. తన అందం గురించి కామెంట్లు చేస్తోన్న వారికి బుద్ది చెప్పేలా ధీటుగా సమాధానమిచ్చారు. తనపై చేస్తున్న కొన్ని కామెంట్ల స్క్రీన్ షార్ట్ లను పోస్ట్ చేస్తూ.. ‘ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఎన్నో సమస్యలను మనం చూస్తున్నాం. వాటిలో ఇది కూడా ఒకటి. దీనిని మనం రూపుమాపాలి. ఇది కేవలం నేను ఒక్కదానినే కాదు ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. నేను చూడడానికి అందంగా ఉండనని కొందరు చేసిన కామెంట్లను నేనూ చూశాను. నేను 12 ఏళ్ల వయసున్నప్పటి నుంచి నాపై ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. నేను మాత్రం వాటిని చూసి బాధపడను. ఇలా ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను’ అని రాసుకొచ్చిందీ స్టార్ డాటర్. ఇక సుహానా చేసిన ఈ పోస్ట్ ను చూసిన కొందరు ఆమెకు మద్ధుతుగా నిలుస్తున్నారు.






