మోదీని ఇబ్బంది పెట్టే ఆలోచ‌న తేజ‌స్వీయాద‌వ్ చేస్తున్నారా..

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిపోయాయి. అయిన‌ప్ప‌టికీ రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. ఇటీవ‌ల బీహార్‌లో ఎల్‌జేపీ నేత రాం విలాస్ పాశ్వాన్ కన్నుమూయడంతో రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది. ఈ సీటును పాశ్వాన్ కుటుంబానికే బీజేపీ కేటాయిస్తుందని చిరాగ్ అంచనా వేశారు. కానీ ఈ అంచనాను తలకిందులు చేస్తూ బీజేపీ అధిష్ఠానం మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీకి కేటాయించింది.

దీంతో రాం విలాస్ ప‌శ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఆవేశంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న తండ్రి మ‌ర‌ణించిన సీటును త‌మ‌కు కేటాయించ‌కుండా వేరే వాళ్ల‌కు ఇవ్వ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌డం లేదు. ఇన్ని రోజులు బీజేపీకి అనుకూలంగానే ఉంటూ కామెంట్లు చేసినా ఈ సీటు విష‌యంలో ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం చిరాగ్ పాశ్వాన్‌కు ఆగ్ర‌హం తెప్పించింది. ఈ సమయాన్నే అదునుగా చేసుకున్న ఆర్జేడీ… చిరాగ్ తల్లి రీనా పాశ్వాన్‌ను తెరపైకి తెచ్చింది. సుశీల్ మోదీకి వ్యతిరేకంగా రీణా పాశ్వాన్‌ను బరిలోకి దింపుదామని ఇప్పటికే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇప్పటికే చిరాగ్ పాశ్వాన్‌కు సూచించినట్లు సమాచారం.

అయితే చిరాగ్‌ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా రాలేదు. నితీశ్, తేజస్వీపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనే తేటతెల్లమైందని, మళ్లీ వారితో కలిసి జట్టు కడితే రాజకీయంగా దెబ్బతింటామన్న దీర్ఘమైన ఆలోచన చిరాగ్ మనసులో ఉన్నట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే చిరాగ్ తల్లి రీనా పాశ్వాన్‌కు మద్దతిచ్చి… చిరాగ్ వర్గం ఓట్లను ఆకర్షించే కొత్త వ్యూహానికి తేజస్వీ తెరలేపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యంలో చిరాగ్ నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోతే మహాఘట్ బంధన్ తరపున సుశీల్ మోదీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిల‌బెట్టాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి ప్ర‌త్య‌ర్థి అయిన మోదీని ఢీ కొట్టేందుకు తేజ‌స్వీ యాద‌వ్ తీవ్రంగా కృషి చేస్తున్న‌ట్లు మ‌న‌కు అర్థ‌మ‌వుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here