షాకింగ్.. రష్యా ప్రధానికి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ప్రధాన మంత్రిని సైతం వదల్లేదు. తనకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లుగా ఆ దేశ ప్రధాని మైఖైల్ మిషుస్తిన్ గురువారం వెల్లడించారు. ఈ మేరకు తాను ఐసోలేషన్‌లో ఉన్నట్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వీడియో కాల్‌లో చెప్పినట్లుగా ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రధానికి కరోనా సోకినందున ఆయనకు నయం అయ్యే వరకూ ఆ బాధ్యతలన్నీ ఇకపై ఉప ప్రధాని అయిన ఆండ్రూయ్ బెలూసోవ్ నిర్వర్తించనున్నారు. కొన్ని విధాన పరమైన నిర్ణయాల విషయంలో తాను అధికారులతో పరోక్షంగా టచ్‌లో ఉంటానని ప్రధాని వెల్లడించారు.

వైరస్ మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడానికి కీలక నిర్ణయాలు, విధానాలు రూపొందించడంలో మిషుస్తిన్ పాల్గొంటారని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యాలో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రధాని పర్యవేక్షిస్తూ.. అధ్యక్షుడికి జవాబుదారీగా ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రధానిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆఖరుసారి ఎప్పుడు కలిశారనే అంశంపై స్పష్టత లేదు. కరోనా కోరలు చాస్తున్న వేళ అధ్యక్షుడు తన సమావేశాలన్నింటినీ రద్దు చేసుకొని, వీడియో కాన్ఫెరెన్సుల ద్వారా నిర్వహిస్తున్నారు. కాగా, మైఖైల్ మిషుస్తిన్ రష్యా దేశ ప్రధానిగా గత జనవరిలో బాధ్యతలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here