ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలు దాటిన కరోనా మృతులు.. 30 లక్షలకు చేరువులో కేసులు

ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ వైరస్‌కు బలైనవారి వారి సంఖ్య 2 లక్షలు దాటింది. బాధితుల సంఖ్య కూడా 30 లక్షలు చేరువైంది. బాధితులు, మరణాల్లో అత్యధికంగా అమెరికా, ఐరోపా దేశాల్లో చోటుచేసుకుంటున్నాయి. ఇక, కేసుల్లో మూడో వంతు, మరణాల్లో నాలుగో వంతు ఒక్క అమెరికాలోనే నమోదయినట్టు జాన్‌ హాప్కిన్స్‌ వర్సిటీ విశ్లేషించింది. స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌, టర్కీల్లో మొత్తం కేసుల కంటే అగ్రరాజ్యంలోనే ఎక్కువ మంది వైరస్ బారినపడటం గమనార్హం. గతవారంతో పోలిస్తే కొత్త కేసులు 38% నుంచి 28 శాతానికి తగ్గాయని, 18 రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయని ట్రంప్ తెలిపారు. అక్కడ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.

ఇదిలా ఉండగా అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాలంటే రోజూ 5 లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు సూచించారు. ఆసియా దేశాల్లో కరోనా వైరస్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చైనాలో వరుసగా పదో రోజు ఒక్క మరణం కూడా చోటుచేసుకోలేదు. విదేశాల నుంచి వచ్చినవారిలో మాత్రం 12 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఐరోపాలో కరోనా దెబ్బకు దాదాపు 1.20 లక్షల మంది మృతిచెందారు. వీరిలో ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, బ్రిటన్‌లకు చెందినవారే మూడొంతుల మంది ఉన్నారు. ఐరోపాలో మొత్తం మొత్తం 13.50 లక్షల మంది కరోనాబారిన పడ్డారు. బ్రిటన్‌లోని కరోనా మరణాలు 20 వేలు దాటాయి.

ఇజ్రాయెల్‌లో కరోనా బాధితుల సంఖ్య 15 వేలను దాటింది. సింగపూర్‌లో నిర్మాణ పనులు చేసుకుంటూ డార్మిటరీల్లో ఉంటున్న భారత్‌ తదితర దేశాలకు చెందిన వలస కార్మికులు అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. మొత్తం 25 డార్మిటరీలున్న ప్రాంతాలను ప్రభుత్వం ఐసోలేషన్‌ ప్రాంతాలుగా ప్రకటించింది. బంగ్లాదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 5 వేలకు చేరువైంది. బ్రెజిల్‌ ఆసుపత్రులన్నీ కొవిడ్‌ బాధితులతో నిండిపోయాయి. మార్చురీలు, శ్మశానాల్లో మృతదేహాలు పేరుకుపోయాయి. రోగులందరికీ సేవలు అందించలేకపోతున్నామని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ దాదాపు 60వేల మందికి వైరస్ సోకగా.. 4వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

అమెరికాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 96,896గా నమోదు కాగా.. 54వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఐరోపాలోని ఇటలీలో 26,384, స్పెయిన్‌లో 22,902, ఫ్రాన్స్‌లో 22,614, బెల్జియంలో 6,917, జర్మనీలో 5,877 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఈ దేశాల్లో బాధితుల సంఖ్య 14 లక్షలుగా ఉంది. స్పెయిన్‌లో 223,759, ఇటలీలో 195,351, ఫ్రాన్స్‌లో 161,488, జర్మనీలో 156,513, బ్రిటన్ 148,377, టర్కీలో 107,773, బెల్జియం 45,3259 మంది వైరస్ బారినపడ్డారు. ఇరాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 89వేలు దాటగా.. 5,650 మంది చనిపోయారు.

రష్యాలోనూ మమహ్మారి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అక్కడ 12 వేల మంది వైరస్ బారిపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంక్య 74,558కి చేరింది. మరణాలు మాత్రం స్వల్పంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ అక్కడ 681 మంది ప్రాణాలు కోల్పోయారు.

నెదర్లాండ్‌లో 3వేల మందికిపైగా వైరస్ బారినపడగా.. 4,400 మంది ప్రాణాలు కోల్పోయారు. కెనడాలో 45వేల కేసులు.. 2,465 మరణాలు, స్విట్జర్లాండ్‌లో 28,894 మందికి వైరస్ సోకగా.. 1599 మంది చనిపోయారు.

స్వీడన్‌లో బాధితుల సంఖ్యతో పోల్చితే మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం 18 వేల మంది వైరస్ బారినపడితే.. 2,192 మంది మృతిచెందారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,921,201 మందికి వైరస్ సోకితే వీరిలో 203, 289 మంది మృత్యువాతపడ్డారు. 836,970 మంది కోలుకోగా.. మరో 18 లక్షల మందికిపైగా వైరస్‌కు చికిత్స పొందుతున్నారు. వీరిలో 58వేల మంది పరిస్థితి విషమంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here