దిక్సూచి మూవీ రివ్యూ

టాలీవుడ్‌లో రకరకాల జోనర్లతో సినిమాలు తెర ముందుకు వచ్చినా.. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుందనే విషయాన్ని గతంలో చిన్న సినిమాలు కూడా నిరూపించాయి. అదే కోవలో వచ్చిన చిత్రం దిక్సూచి. బాలనటుడిగా 20 ఏళ్లకుపైగా ప్రేక్షకులకు దగ్గరైన దిలీప్ కుమార్ సల్వాది హీరో, డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా అవతారం ఎత్తి సినిమాను తెరకెక్కించారు. చాందిని హీరోయిన్‌గా నటించగా నరసింహారాజు రాచూరి, శైలజ సముద్రాల నిర్మించారు. డివోషనల్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్ది ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. బాలనటుడిగా మెప్పించిన దిలీప్ కుమార్ హీరోగా, డైరెక్టర్‌గా ఆకట్టుకొన్నారా? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

టెలివిజన్ ఛానెల్లో రిపోర్టర్‌గా పనిచేసే దిలీప్ (దిలీప్ కుమార్) అహోబిలం పుణ్యక్షేత్రానికి కవరేజ్‌ కోసం వెళ్తాడు. గుడిలో హీరోయిన్‌ (చాందిని)ని చూసి తొలిచూపులోనే ప్రేమలోపడుతాడు. ఆ క్రమంలో దిలీప్‌కు ఓ అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేసి తాను చెప్పిన పనిచేయకపోతే చెల్లి, తల్లిని చంపేస్తానని బెదిరిస్తాడు. దాంతో అజ్ఞాతవ్యక్తి చెప్పిన పనులన్నీ చేస్తాడు. అజ్ఞాతవ్యక్తి ట్రాప్‌లో పడి సొంత తల్లి, చెల్లిని కిడ్నాప్ చేసినట్టు దిలీప్ గ్రహిస్తాడు. కిడ్నాప్ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత 1975లో రాజా బహద్దూర్ పురంలో ఇలాంటి సంఘటనలే జరిగాయనే విషయం తెలుస్తుంది.

కిడ్నాప్ గురైన తల్లి, చెల్లిని విడిపించుకోవడానికి దిలీప్ ఏం చేశాడు? అజ్ఞాతవ్యక్తి కిడ్నాప్ వెనుక అసలు అంతర్యం ఏమిటి? రాజా బహద్దూర్ పురంలో కిడ్నాప్‌లు జరగడానికి కారణం ఏమిటి? ప్రేమించిన చాందినీ వెనుక కథేంటి? చాందిని ప్రేమ పెళ్లి పీటల మీదకు చేరిందా? చత్రపతి శేఖర్ పాత్ర ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే దిక్సూచి సినిమా కథ.

శివ భాగవానుడు నేపథ్యంగా అల్లు కొన్న కథ ఇది. భక్తి, రాజవంశంలో ఉండే ఇగోలు ప్రధానం అంశంగా తీసుకొని దిక్సూచి డివోషనల్ థ్రిల్లర్‌గా రూపొందింది. సినిమాను సాగదీయకుండా చకచకా కథలోకి వెళ్లిపోవడం స్టోరీలో ప్రేక్షకుడిని లీనం కావడానికి దోహదపడింది. కథ సింగిల్ పాయింట్ ఎజెండా కావడంతో తొలిభాగంలో వేగంగా పరుగులు పెడుతుంది. తొలిభాగం నిడివి కొంత తక్కువగా ఉండటంతో రిలీఫ్‌గా ఉంటుంది.

ఇక రెండో భాగంలోనే అసలు కథ మొదలవుతుంది. కథ అనేక మలుపు తిరుగుతూ ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేస్తుంది. కథంతా సెకండాఫ్‌లో కుక్కడం వల్ల చాలా హేవీగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు కొంత ఇబ్బందిగా ఉంటాయి. కాకపోతే వాటిని హ్యాండిల్ చేసిన తీరు ఆకట్టుకొనేలా ఉండటం వల్ల ప్రేక్షకుడు ట్రాక్ తప్పుకుండా ఉండేలా చేసింది. కొన్ని సన్నివేశాలు అనవసరంగా, మరికొన్ని సీన్లు ఎమోషనల్‌గా కనిపిస్తాయి.

దర్శకుడిగా కంటే హీరోగా, ఎడిటర్‌గా దిలీప్ కుమార్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. తొలి దర్శకత్వంలో ఉండే తడబాట్లు కొన్ని కనిపించినప్పటికీ.. అవేమీ పట్టించుకొనేంత సీరియస్‌గా లేకపోవడం కొంత ఉపశమనం. భవిష్యత్‌లో దిలీప్ మంచి స్టోరీ టెల్లర్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. 20 ఏళ్ల యాక్టింగ్ ఎక్సీపిరియన్స్‌తో దిలీప్ కొన్ని సీన్లలో ఇరుగదీశాడు. సినిమా పరంగా రకరకాల బాధ్యతలు మోయడం వల్ల యాక్టింగ్, ఇతర విభాగాలపై ఆ ప్రభావం పడినట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా మొదటి ప్రయత్నం అభినందనీయం.

ఇక హీరోయిన్ చాందినీ పాత్ర నిడివి ఎక్కువగానే ఉన్నప్పటికీ.. నటించడానికి స్కోప్ లేని పాత్ర. అలాగే పాటలకు ఎక్కువగా ఛాయిస్‌ లేని కథ కావడంతో ఆమె పాత్రకు పెద్దగా అవకాశం దక్కలేదు. కొన్ని సీన్లలో మంచి ఎక్స్‌ప్రెషన్స్ కనిపించాయి. ఇక చైల్డ్ ఆర్టిస్టుగా ధన్వి హైలెట్‌గా నిలిచింది. కొన్ని సీన్లలో ఆమె వయసు కంటే ఎక్కువ కంటెంట్‌‌ను పెట్టడం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. బిత్తిరి సత్తి కామెడీ ఫర్వాలేదు. ఇంకా బెటర్‌గా ఉపయోగించుకొనే అవకాశం ఉన్నా అది జరిగినట్టు కనిపించలేదు. సమ్మెట గాంధీ పాత్ర ఒకేలా ఉంది. చాలా రోజుల తర్వాత ఛత్రపతి శివాజీకి మంచి ప్రాధాన్యం ఉన్న రోల్ దక్కింది. తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, జయకృష్ణ ఫోటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌ను కొత్తగా చూపించాడు. గ్రాఫిక్ వర్క్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాను చాలా రిచ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లేపై మరింత దృష్టిపెట్టి ఉంటే సినిమా రేంజ్ మరింత పెరిగేది. పాత్రల ఇంటెన్సెటీ ప్రకారం చూస్తే.. ఎంపిక చేసుకొన్న నటీనటులు తేలిపోయినట్టు కనిపిస్తుంది. పాత్రలు డెలివరీ చేసే మెసేజ్ రీచ్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

థ్రిలర్ జానర్‌లో దిక్సూచి కొత్తగా అనిపిస్తుంది. భక్తి, ప్రేమ, పగ, ప్రతీకారం అంశాలు కలిసి ఉన్న చిత్రం. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఆకట్టుకొనే అంశాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనే క్లాస్ టచ్ కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు చేరితే చిన్న చిత్రాల్లో మంచి సినిమాగా మారే అవకాశం ఉంటుంది.

రేటింగ్ : 3/5

 

Comments

comments

Leave a Reply

*