ఎన్నికల వేళ జగన్ సంచలనం.. ఇక ఓట్ల వానే..

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రలో రాజకీయం వేడెక్కుతోంది. అటు అధికార టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇటు వైసీపీ అధినేత జగన్‌ తమ ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ ప్రభుత్వం వస్తే అభివృద్ధి పనులు ఇలా చేస్తామని వివరిస్తున్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని.. మరోసారి వస్తే మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుంటామని చంద్రబాబు చెబుతున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్‌ మాత్రం సమాజంలో ఎక్కువగా ఉన్న పేదవారు, విద్యార్థులపై దృష్టి సారించారు. అందువల్ల వారికి సంబంధించిన పథకాలు ప్రవేశపెడుతామని చెబుతున్నారు. ప్రత్యర్థి చంద్రబాబుకు రాని ఈ పాయింట్లతో జగన్‌ ప్రజల మనసును దోచుకునేలా ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం పేదవారికి కావలసింది రోడ్లు, బిల్డింగులు కాదని.. వారికి కనీస అవసరాలు తీరిస్తే సరిపోతుందని జగన్‌ చెప్పుకొస్తున్నారు. ఇందులో భాగంగా పేద, మధ్యతరగతికి అత్యవసరమైన వైద్య సదుపాయ పథకం గురించి వివరిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే పేదవారి నుంచి రూ.40వేలు జీతం లోపు వచ్చే వారందరికీ యూనివర్సల్‌ హెల్త్‌కార్డులు తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే వాళ్లందరినీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీలోకి తీసుకువస్తామన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో తానే ఈ పథకాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.

ఈరోజుల్లో కనీస సౌకర్యాలతో పాటు విద్య కూడా అత్యవసరమైంది. అందువల్ల ప్రతి ఒక్క విద్యార్థి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటున్నానని జగన్‌ అంటున్నారు. అందుకోసం విద్యార్థులకు ప్రభుత్వమే చదువు చెప్పిస్తుందని చెబుతున్నారు. ఈ పథకంపై టెలివిజన్లలో అడ్వర్టయిజ్‌మెంట్‌ కూడా ఇవ్వడంతో ప్రజల్లో వైసీపీపై నమ్మకం పెరుగుతోంది.

తాజాగా జగన్‌ గుంటూరు జిల్లాలో మాట్లాడుతూ తాను పాదయాత్ర చేసినప్పుడు రోడ్లన్నీ మట్టితోనే కూడుకున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగానే ఉందన్నారు. ఈ పరిస్థితి రాజధానికి సమీపంలోనే ఉన్న గుంటూరు జిల్లాలోనే ఉండడం బాధాకరమన్నారు. ఇక మారుమూల జిల్లాలో ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవాలని ప్రజలకు చెప్పారు. దీంతో ఫ్యాన్‌ పార్టీని గెలిపిస్తే మొత్తం మార్చేస్తామని.. దీని గురించి కూడా ఆలోచించాలని రాష్ట్ర ప్రజలను కోరారు.

గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పరాజయం చెందిన వైసీపీ ఈ ఐదేళ్లలో ఎంతో కసరత్తు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు విస్తృతంగా పర్యటించారు. తాను ఓడిపోయినా ప్రజలతో ఉంటానని పార్టీ అధినేత జగన్‌ సంకల్పయాత్ర పేరుతో గల్లిగల్లీ తిరిగారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి మార్గాలు చూపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పారు. మరోవైపు టీడీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న కీలక నేతలు వైసీపీలోకి చేరడం చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ అవలంభిస్తున్న విధానాలు నచ్చక.. జగన్‌ చేస్తున్న చర్యలకు ఆకర్షితులై వైసీపీలోకి చేరారు. ఓవైపు పార్టీ నాయకుల బలం.. మరోవైపు జగన్‌ చెబుతున్న పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారనే చెప్పవచ్చు.

Comments

comments

Leave a Reply

*