ఆ ఇద్ద‌రిని ఎందుకు ప్ర‌శ్నించ‌రు?

అమ‌రావ‌తి: అధికారంలో ఉండి ఎంత‌టి నేరం చేసినా ఒప్పేనా? ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారు ప్రాణాలు కొల్పోయినా ఆ కుటుంబానిదే త‌ప్పా? అస‌లు రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం ఉందా? నీతి..నిజాయితీగా రాజ‌కీయాలు చేయ‌డం ప‌చ్చ నేత‌ల‌కు న‌చ్చ‌దా? అన్న అనుమానాలు క‌లుగ‌క‌మాన‌దు. ఇటీవ‌ల మాజీ మంత్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడు వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు గురైతే..నిందితుల‌ను శిక్షించాల్సిన ప్ర‌భుత్వం..ఆ కేసును త‌ప్పుదారి ప‌ట్టించేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. పైగా త‌ప్పు చేసిన వారిని, అనుమానం ఉన్న వారిని ప‌ల్లెత్తు మాట అన‌డం లేదు. వారిని విచారించాల్సిన క‌నీస ధ‌ర్మాన్ని కూడా మ‌రిచి దొంగే దొంగ దొంగ అన్న‌ట్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని విష ప్ర‌చారం చేయ‌డం నీచ రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌నం. అస‌లు వివేకానంద‌రెడ్డిని చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి ఉండ‌దు. ఆయ‌న అజాత శ‌త్రువు.

ఎవ‌రు వ‌చ్చి సాయం అడిగినా దానం చేసే దాతృత్వం ఉన్న మ‌నిషిని ప్ర‌త్యుర్థులు పొట్ట‌న పెట్టుకుంటే..అందులో కూడా ల‌బ్ధి పొందాల‌ని అధికార పార్టీ ప్ర‌య‌త్నించ‌డం దుర్మార్గ‌మే అవుతుంది. అస‌లు హ‌త్య చేసిన వారు ఎవ‌రు? వారిని కాపాడుతున్న‌ది ఎవ‌ర‌న్న‌ది లోకానికి తెలుసు. హ‌త్య జ‌రిగిన వెంట‌నే అంద‌రు మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, బీటెక్ రవి పాత్ర ఉంటుంద‌ని భావించారు. అంతేకాకుండా హ‌త్య జ‌రిగిన రోజు ఉద‌య‌మే మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి హుటావుటినా ప్రెస్‌మీట్ పెట్టి గుమ్మ‌డికాయ‌ల దొంగ‌లు భుజాలు త‌డుముకున్న‌ట్లుగా మాట్లాడారు. సీట్ల విష‌యంలో కుటుంబ త‌గాదాలు ఉన్నార‌ని ఆరోపించారు. వాస్త‌వానికి వివేకానంద‌రెడ్డిని జ‌మ్ముల‌మ‌డుగు ఎన్నిక‌ల ఇన్‌చార్జ్‌గా నియ‌మించ‌డంతో త‌మ ఆట‌లు సాగ‌వ‌నే ఈ హ‌త్య‌కు కుట్ర చేశార‌ని జిల్లాలో కోడై కూసింది. రాజ‌కీయ కుట్ర కోణంలో సిట్ అధికారులు ఈ ఇద్ద‌రిని ఎందుకు విచారించ‌లేద‌న్న అనుమానాలు రాష్ట్ర‌వ్యాప్తంగా క‌లుగుతున్నాయి.

దీనికితోడు చంద్ర‌బాబు ఏ స‌భ‌లో మాట్లాడినా ఇది కుటుంబ హ‌త్య అంటూ మొద‌టి నుంచి కేసును ప‌క్క‌దారి ప‌ట్టిస్తూ విచార‌ణ అధికారులకు ముఖ్య‌మంత్రి హోదాలో దిశానిర్దేశం చేస్తున్నారు. గ‌తంలో జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన సంద‌ర్భంలో కూడా చంద్ర‌బాబు ఇలాంటి వ్యాఖ్య‌లే చేసి ఆ కేసును నీరుగార్చే ప్ర‌య‌త్నం చేశారు. వివేకా కేసులో కూడా ఇదే జ‌రుగుతోంది. ఏ త‌ప్పు చేయ‌క‌పోతే సీబీఐ విచార‌ణ‌కు చంద్ర‌బాబు ఎందుకు నిరాక‌రిస్తున్నార‌న్న అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, బీటెక్ ర‌విల‌ను ఎందుకు పోలీసులు విచార‌ణ చేయ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌రుగుతున్న‌ట్లు అయితే కుటుంబ స‌భ్యుల‌తో పాటు అనుమానం ఉన్న అంద‌రిని విచారించాల్సి ఉండ‌గా ఆ దిశ‌గా కేసు ద‌ర్యాప్తు సాగ‌డం లేదు. ఇక‌నైనా ఆ ఇద్ద‌రిని విచారిస్తే నిజాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Comments

comments

Leave a Reply

*